ధర్మపురిలో పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
ధర్మపురి, అక్టోబర్ 3: 2027లో జరగనున్న గోదావరి పుష్కర మహోత్సవాలను పురస్కరించుకుని ధర్మపురి పట్టణంలోని గోదావరి నది తీరంలో కొనసాగుతున్న పుష్కర ఘాట్ల నిర్మాణ, అభివృద్ధి పనులను అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజుగౌడ్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న పుష్కర ఘాట్లు, ఇతర అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో అడిషనల్ కలెక్టర్ సమీక్షించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా ధర్మపురికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల తనిఖీ
అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అడిషనల్ కలెక్టర్.. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలోని సౌకర్యాలు, వైద్య సిబ్బంది సమయపాలనను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
ఆసుపత్రిలో రోగులకు అవసరమైన రక్త పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు మెరుగైన తాగునీటి సౌకర్యాన్ని నిరంతరం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ పనుల పరిశీలన
అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా శంకుస్థాపన చేసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పర్యటనలో మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, తహసీల్దార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.