ఏపీ ప్రజలకు వాతావరణ హెచ్చరిక.. నేడు పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం నెలకొనే అవకాశం ఉందని, అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ కూడా తీర ఆంధ్రప్రదేశ్‌కు శనివారం ఉరుములు, పిడుగులు, బలమైన ఉపరితల గాలుల హెచ్చరికను జారీ చేసింది.
వర్షం సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల వద్ద ఉండకుండా సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. రైతులు, వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ప్రజలు అత్యవసర సమయంలో విపత్తుల నిర్వహణ సహాయ నంబర్ 1070 లేదా 112ను సంప్రదించవచ్చు.