శెట్టివారిగూడెం–వెంకటాపురంలో ఉద్రిక్తత
భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు.. రెవెన్యూ సిబ్బందికి నిరసన
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడెం–వెంకటాపురం గ్రామాల మధ్య ప్రతిపాదిత రిలయన్స్ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బందిని శుక్రవారం రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు.
శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి, రిలయన్స్ సంస్థ ప్రతినిధులు భూముల కొలతలు చేపట్టేందుకు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు వందలాదిగా అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. తమ భూములను ప్రాజెక్టు కోసం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
తమకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములను కోల్పోతే కుటుంబాల భవిష్యత్తు దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లో సర్వే నిర్వహించడం సరికాదని అభ్యంతరం తెలిపారు.
రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సర్వే ప్రాంతానికి చేరుకుని కొలతలను అడ్డుకోవడంతో భూసర్వే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూముల విషయంలో స్పష్టమైన సమాచారం, హామీ ఇచ్చే వరకు సర్వేకు అనుమతించబోమని రైతులు తేల్చిచెప్పారు.