పెళ్లి వేడుకలో గాల్లోకి కాల్పులు.. ఇద్దరిపై కేసు
హైదరాబాద్: పాతబస్తీలోని బర్కాస్ ప్రాంతంలో పెళ్లి వేడుక సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఓ పెళ్లి వేడుకలో వ్యాపారవేత్త అమీర్ బిన్ సయీద్ (41) రివాల్వర్‌తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి అమీర్‌ను గుర్తించారు.
అమీర్ నివాసానికి వెళ్లిన పోలీసులు రివాల్వర్ గురించి ప్రశ్నించగా.. అది తన కజిన్ వలీద్ హుస్సేన్‌కు చెందిన లైసెన్స్‌డ్ రివాల్వర్ అని తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై అమీర్ బిన్ సయీద్, వలీద్ హుస్సేన్‌పై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2025 ఆగస్టులో వలీద్ సోదరుడు ఒబైద్ వివాహ వేడుకలోనూ గాల్లోకి కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.