తెలంగాణ అభివృద్ధిలో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింత సహకరించాలి: రేవంత్ రెడ్డి
విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ఫ్యూచర్ సిటీకి ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదన
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి ఆయనతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం గుర్తుచేశారు. హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న చారిత్రక అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఫౌండేషన్‌పై తనకు అత్యంత గౌరవం ఉందన్నారు.
తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫౌండేషన్ సహకారంతో శాసనమండలి భవనం, కుతుబ్ షాహీ టూంబ్స్ పునరుద్ధరణ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రణాళికలను ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌కు వివరించారు.
మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని అభివృద్ధి చేయడంతో పాటు చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో ఫౌండేషన్ సహకరించాలని సీఎం కోరారు. గోషామహల్‌లో నూతన ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుత ఆసుపత్రి భవనాన్ని వారసత్వ కట్టడంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను వివరించారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ ఆసక్తి కనబరచగా, 30 వేల ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో నెట్-జీరో సిటీగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 20 నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, ఇందులో దాదాపు 15 వేల ఎకరాలను గ్రీన్ జోన్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సింగపూర్‌కు చెందిన సంస్థ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
విద్యా రంగంలోనూ అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలను పెంచుతున్నట్లు సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు వివరించారు. హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు ఇతర ప్రపంచస్థాయి విద్యాసంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా కోరారు.
పర్యాటక రంగంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో మరింత సహకారం అందించాలని కోరారు. సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు, ఆగా ఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.