ప్రభుత్వ భూమికి పట్టా జారీపై ఆరోపణలు
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలో ప్రభుత్వ భూమికి సంబంధించిన రికార్డుల మార్పు, పట్టా జారీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఈ వ్యవహారంపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
మంగళ్‌పల్లిలోని ప్రభుత్వ భూమిలో 4.25 ఎకరాల భూమికి ప్రైవేటు వ్యక్తి పేరుతో పట్టా జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టా పాస్‌బుక్ కుడా జారీ అయినట్లు సమాచారం.
సదరు భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూమి రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయి, పట్టా పాస్‌బుక్ జారీకి సంబంధించిన ప్రక్రియలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశాలపై అధికారులు వివరాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మార్వో సంతకం నిజమైనదా, రికార్డుల్లో మార్పులు ఏ విధంగా జరిగాయి, పట్టా జారీకి ఆధారాలేమిటనే అంశాలపై అధికారిక విచారణ జరిగితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.