అమరావతి మద్యం షాపుల రెన్యువల్ బాటలో ప్రభుత్వం
కొత్తగా వేలం లేకుండానే ప్రస్తుత షాపులకు కొనసాగింపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి మద్యం షాపులకు కొత్తగా వేలం నిర్వహించకుండా, ప్రస్తుతం కొనసాగుతున్న షాపులనే రెన్యువల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కోనసీమలో నిర్వహించిన సభలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల రెండేళ్ల కాలపరిమితి వచ్చే నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కొత్తగా వేలం నిర్వహిస్తే వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతోపాటు, వేలంలో షాపులు దక్కించుకునేందుకు యువత తమ కష్టార్జితాన్ని, సొమ్మును పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత షాపులకే రెన్యువల్ అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఎమ్మార్పీ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మద్యం షాపుల్లో నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర కంటే అధికంగా విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నాణ్యమైన మద్యం అందించడమే లక్ష్యం
ప్రజలకు నాణ్యమైన మద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. మద్యం విక్రయాల్లో నిబంధనలు పాటించేలా, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.