పెనుగొలనులో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని గ్రంథాలయంలో మంగళవారం భారతరత్న, ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న జన్మించారని తెలిపారు. మైసూరు సంస్థానానికి 1912 నుంచి 1918 వరకు దివానుగా సేవలందించారని వివరించారు. మైసూరులోని కృష్ణరాజ సాగర ఆనకట్ట నిర్మాణంలో చీఫ్ ఇంజనీర్‌గా కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వరదల నుంచి రక్షించేందుకు పలు రక్షణ చర్యలు, ప్రణాళికలను రూపొందించారని తెలిపారు.
దేశ అభివృద్ధికి దోహదపడే అనేక నీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనతో పాటు పలు నగరాల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు విశ్వేశ్వరయ్య కృషి చేశారని వివరించారు. ఇంజనీరింగ్ రంగానికి, దేశ నిర్మాణానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15ను దేశవ్యాప్తంగా ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1955లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, ఓట్ల వెంకటేశ్వరరావు, గ్రంథాలయ సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.