చింతలపూడిలో చెరువు కట్టకు గండి..
చింతలపూడిలో చెరువు కట్టకు గండి.. బోయగూడెం, ముతరాసుల కాలనీలు జలదిగ్బంధం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో చెరువు కట్టకు గండి పడటంతో పట్టణంలో కలకలం రేగింది. చెరువు కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా భారీగా వరద నీరు దిగువ ప్రాంతాల వైపు పోటెత్తింది. దీంతో సమీపంలోని బోయగూడెం, ముత్రాసుల కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో పలు ఇళ్లలోకి నీరు దూసుకొచ్చింది. అర్ధరాత్రి వేళ వరద ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వృద్ధులు, చిన్నారులు వరద నీటి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చెరువు కట్టకు పడిన గండిని పూడ్చడంతో పాటు వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.