మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్‌ను ఒమన్ నుంచి భారత్‌కు రప్పించిన CBI.
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ సిండికేట్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్‌ను సీబీఐ అధికారులు ఒమన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ (Extradition) పూర్తయిన అనంతరం సీబీఐ బృందం ఇండియాకు తీసుకొచ్చింది. సౌరభ్ చంద్రకర్‌పై సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా మరో ప్రత్యేక కేసులో దర్యాప్తు చేస్తోంది. సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో ఇప్పటికే ఛార్జ్‌షీట్లు దాఖలయ్యాయి. సోమవారం అతడిని రాయ్‌పూర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.
దేశవ్యాప్తంగా బెట్టింగ్ ప్యానళ్ల ద్వారా ఈ నెట్‌వర్క్ కార్యకలాపాలు సాగించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్, హవాలా మార్గాల ద్వారా తరలించినట్లు పేర్కొంది. మహాదేవ్‌తో పాటు అనుబంధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమ ఆదాయం విలువను ED ఏకంగా రూ.94,400 కోట్లుగా అంచనా వేసింది. ఈ కేసులో మరో కీలక పరిణామంగా మహాదేవ్ యాప్ సహ వ్యవస్థాపకుడు రవి ఉప్పల్‌ను కూడా UAE నుంచి భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.