చాట్రాయి: వినాయక నిమజ్జనంపై పోలీసుల అప్రమత్తం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, డీజే నిర్వాహకులతో అవగాహన సమావేశం
వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చాట్రాయి పోలీసులు చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కే.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ, పోలీసు సిబ్బంది ఉత్సవ కమిటీ సభ్యులు, డీజే నిర్వాహకులు, యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిమజ్జన ఊరేగింపులు, వినాయక మండపాల వద్ద డీజే శబ్ద వ్యవస్థలను ప్రభుత్వ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అధిక శబ్దంతో వినియోగించరాదని స్పష్టం చేశారు. ప్రజలు, వృద్ధులు, విద్యార్థులు, రోగులకు ఇబ్బంది కలగకుండా అనుమతించిన పరిమితిలోనే శబ్ద వ్యవస్థలను వినియోగించాలని డీజే నిర్వాహకులను హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వినాయక మండపాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసే నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ తదితర శాఖల అనుమతులను ఒకే వేదిక ద్వారా పొందేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్‌లైన్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మండపాల వద్ద రాత్రి వేళల్లో కమిటీ సభ్యులు లేదా స్వచ్ఛంద సేవకులు తప్పనిసరిగా కాపలా ఉండాలని, అసాంఘిక శక్తులకు అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జన సమయంలో ఊరేగింపు మార్గాల్లో పోలీసుల సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.
వినాయక చవితి, నిమజ్జన వేడుకలను ప్రజలంతా ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో, ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్వహించాలని చాట్రాయి పోలీసులు విజ్ఞప్తి చేశారు.