పోతనపల్లి: మానవత్వం చాటుకున్న బూత్ కన్వీనర్ ఏసుబాబు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దతండాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి సమస్య తలెత్తింది. సరైన వర్షాలు లేకపోవడంతో పంచాయతీ మోటార్లలో నీటి లభ్యత తగ్గిపోయి, గత కొన్ని రోజులుగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను గ్రామ నాయకులు డి.మంగయ్య దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పోతనపల్లి బూత్ కన్వీనర్ బాణావతు ఏసుబాబుతో మాట్లాడారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ఏసుబాబు తన వ్యవసాయ బోరు నుంచి నీటిని గ్రామ అవసరాలకు అందించేందుకు ముందుకు వచ్చారు.
దీంతో గ్రామ నీటి సహాయకుడు డి.శ్రీను ద్వారా వ్యవసాయ బోరు నీటిని పంచాయతీ పైపులైనుకు అనుసంధానం చేశారు. దీంతో పెద్దతండా ప్రజలకు నీటి ఇబ్బందులు కొంతవరకు తొలగడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు సహాయం అందించిన బాణావతు ఏసుబాబుకు, సమస్యను తన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన డి.మంగయ్యకు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజల అవసరాల సమయంలో స్పందించి సహాయం చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.