చింతలపూడి: ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో అవకతవకలపై ఉన్నతాధికారుల విచారణ
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు విషయంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. విశాఖపట్నంలోని విద్యుత్ శాఖ సీఎండీ కార్యాలయం నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం చింతలపూడి ఏడీ కార్యాలయంలో రైతులను పిలిపించి వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు మంజూరు కాలేదని పలువురు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ తమకు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కాలేదని, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల బృందం రైతుల నుంచి వివరాలు సేకరించి, గతంలో చేసిన దరఖాస్తులు, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు ప్రక్రియకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా విచారణతోనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా, తమకు న్యాయం జరుగుతుందా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.