అర్నాబ్ తుఫాను ముప్పు.. ముందస్తు సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వద్దు
భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష
ఏలూరు జిల్లా, నూజివీడు, అక్టోబరు 27: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాను ప్రభావంతో ఈ నెల 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. తుఫాను పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలపై మంగళవారం జిల్లా అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు పంటలు, పశుసంపదకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నవారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, అక్కడ తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచి, అత్యవసర సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలకు వాతావరణ పరిస్థితులు, తుఫాను హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో టామ్‌టామ్ ద్వారా హెచ్చరికలు ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలు వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా, అధికారుల సూచనలు పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈదురుగాలులకు చెట్లు కూలిన ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని, రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని మంత్రి సూచించారు. విద్యుత్ వైర్లు తెగిపడిన చోట్ల ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా, వైద్య శిబిరాలు, రవాణా వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు తలెత్తినా తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. తుఫాను సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటమే అత్యంత ప్రాధాన్యంగా భావించి, ముందస్తు చర్యల నుంచి సహాయక కార్యక్రమాల వరకు ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకూడదని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని సకాలంలో అందిస్తూ, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. జిల్లా సమాచార శాఖ, ఏలూరు జిల్లా విడుదల చేసిన ప్రకటన ఆధారంగా.