అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ
రూ.2,692.34 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
అమరావతి, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో 61.80 లక్షల మంది పింఛనుదారులకు అక్టోబర్ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.2,692.34 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె ఉన్నప్పటికీ పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
విడుదల చేసిన నిధుల్లో రూ.2,675.63 కోట్లను సంబంధిత స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మరో రూ.16.65 కోట్లను పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ చేయనున్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు SNA-SPARSH విధానంలో ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసే విధానాన్ని విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
బ్యాంకు సెలవులు, సమ్మె నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
సెప్టెంబర్ 26న బ్యాంకు సెలవు, సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో జాప్యం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
అక్టోబర్ 1 ఉదయం పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC)కి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది అక్టోబర్ 1 ఉదయం బ్యాంకుల నుంచి నగదును విత్‌డ్రా చేసుకుని, అదే రోజు మధ్యాహ్నం నుంచి పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదు పింఛన్లను పంపిణీ చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. ఈ పంపిణీ విధానంలో జరిగిన మార్పును పింఛనుదారులు గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.