మంచిర్యాలలో రాహుల్ గాంధీ, ఎంపీ బిమోల్ అకోయిజమ్ దిష్టిబొమ్మల దహనం
మంచిర్యాల: జేఎన్‌యూలో 11 మంది విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అంగోంచా బిమోల్ అకోయిజమ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాలలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ బిమోల్ అకోయిజమ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మంచిర్యాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పచ్చ స్వప్నరాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని విమర్శించారు. జేఎన్‌యూలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీపై కాంగ్రెస్ నాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంపీ బిమోల్ అకోయిజమ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాహుల్ గాంధీని కోరారు. మహిళలు, విద్యార్థినులపై వేధింపుల ఘటనలను తీవ్రంగా పరిగణించాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్వప్నరాణి పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులు బైరాన్ లక్ష్మి, బొంగోని శిరీష గౌడ్, ఎడ్ల స్వరూప, మాదాసు సృజన దేవి, తూటి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
జేఎన్‌యూలో 11 మంది విద్యార్థినులు చేసిన ఫిర్యాదులపై అంతర్గత విచారణ అనంతరం అకోయిజమ్‌ను అధ్యాపక విధుల నుంచి తొలగించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ ఆరోపణలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం.