25 ఎకరాల భూమి పంపకం.. నిరాదరణతో వృద్ధ దంపతుల ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా: తమకున్న 25 ఎకరాల భూమి, ఇంటిని ముగ్గురు కుమారులకు పంచిన వృద్ధ దంపతులు చివరకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ నిరాదరణతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తా.కె గ్రామంలో విషాదాన్ని నింపింది.
గ్రామానికి చెందిన ముంగే నర్సారెడ్డి (88), అంజమ్మ (85) దంపతులు తమ ఆస్తిని కుమారులు సిద్ధారెడ్డి, కృష్ణారెడ్డి, సంగారెడ్డిలకు పంచినట్లు సమాచారం. ఆస్తి పంపకాల అనంతరం కుమారులు తమను పట్టించుకోవడం లేదని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
అంజమ్మ అనారోగ్యంతో వంట చేసుకోలేని పరిస్థితి ఏర్పడటంతో కొన్నిరోజులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంతోనే జీవనం సాగించినట్లు స్థానికులు వెల్లడించారు. తమ జీవనోపాధి కోసం పంచిన భూమిలో ఒకటి లేదా రెండు ఎకరాలు తిరిగి ఇప్పించాలని పోలీసులను, అధికారులను కోరినా ఫలితం లేకపోయిందని సమాచారం.
తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల మనవడు తిరుపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, వృద్ధుల జీవన భద్రతపై ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆస్తి పంపకాలు, నిరాదరణకు సంబంధించిన ఆరోపణలు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.