తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ జి.జె.వి.ఎస్.ఎన్.డి. లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో తిరువూరు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన కంటి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ పాల్గొని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానాచార్యులు డాక్టర్ జి.జె.వి.ఎస్.ఎన్.డి. లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన ఆరోగ్యం, అవసరమైన సౌకర్యాలు కల్పించడం కళాశాల బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవన విధానాన్ని కూడా ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని ఆమె అభినందించారు. విద్యార్థులు కళాశాల సిబ్బందిపై చూపుతున్న ప్రేమానురాగాలు, సానుకూల దృక్పథం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
కంటి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే కంటి సమస్యలను గుర్తించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. కంటి చూపు బలహీనత, దూరంగా లేదా దగ్గరగా ఉన్న వస్తువులను చూడటంలో ఇబ్బంది, తరచూ కళ్లలో నీరు కారడం, తలనొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. శిబిరంలో కంటి చూపులో లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన చికిత్స, వైద్య సహాయం అందిస్తామని తెలిపారు. కళ్లజోడు అవసరమైన విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా కళ్లజోళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు డాక్టర్ జి.జె.వి.ఎస్.ఎన్.డి. లక్ష్మి, కంటి వైద్యులు డాక్టర్ ప్రవీణ్, గ్రంథాలయ బాధ్యులు కె. ప్రసాద్, కళాశాల నిర్వహణ ప్రతినిధులు వి. అజయ్ కుమార్, జి. నరసింహరావు, మాజిమణి, యోగానంద్, వైద్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన వైద్య బృందానికి కళాశాల సిబ్బంది, విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.