గర్భిణులు, బాలింతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గర్భిణులు, బాలింతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మధిరలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా శ్రీమంత–అన్నప్రాసన వేడుకలు
మధిర, ఆగస్టు 6: తల్లిపాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా మధిరలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రీమంత, అన్నప్రాసన వేడుకలు సంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగాయి. గర్భిణులకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సామినేని సుజాత మాట్లాడుతూ గర్భిణులు, బాలింతల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, వారి ఆరోగ్య రక్షణ కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆధునిక జీవనశైలిలోనూ మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గర్భధారణ దశ నుంచే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన తల్లి, బిడ్డతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు పడతాయని పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ సామ్యూల్ పాల్ మాట్లాడుతూ ఐసీడీఎస్, అంగన్వాడీ వ్యవస్థల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు అందుతున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. పీడీ ఏ. ప్రమీల, సీడీపీఓ జి. కృష్ణశ్రీ, ఎస్సీడీపీఓ షకీరా పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
కార్యక్రమంలో గర్భిణులకు సంప్రదాయ పద్ధతిలో ఓడీ పోసి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.