గుడివాడ మాజీ ఎమ్మెల్యే పిచ్చి ప్రేలాపనలకే పరిమితం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ: మాజీ ఎమ్మెల్యే పిచ్చి ప్రేలాపనలకే పరిమితం మంత్రి నారా లోకేష్‌పై మాట్లాడే అర్హత నానీకి ఉందా: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము డీఎస్సీపై చర్చకు లోకేష్ సిద్ధం.. స్థానిక ఎన్నికలు డిసెంబరులో నిర్వహిస్తాం
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీ పిచ్చి ప్రేలాపనలకే పరిమితమవుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విమర్శించారు. గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్‌పై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యేకు లేదన్నారు. ఓడిపోయిన వ్యక్తి స్థాయి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డీఎస్సీపై చర్చకు రావాలని లోకేష్ స్వయంగా ప్రకటించారని రాము తెలిపారు. తమ నాయకుడు తన స్థాయిని తగ్గించుకుని చర్చకు సిద్ధమని ప్రకటించినా వైసీపీ నేతలు డీఎస్సీపై అబద్ధాల ప్రచారం ఆపడం లేదని విమర్శించారు. ఈ అంశంపై న్యాయస్థానాలు మూడుసార్లు కొట్టివేసినా వైసీపీ ప్రచారం కొనసాగించడం సరికాదన్నారు.
వైసీపీ విధానమే అందరూ తమలాగే అవినీతిపరులని ప్రచారం చేయడమని రాము ఆరోపించారు. అయితే ప్రజలకు వాస్తవాలు తెలుసని, తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిజాయితీపరులమని చెప్పే ధైర్యం వైసీపీ నేతలకు లేదని విమర్శించారు.
స్థానిక ఎన్నికల ప్రాధాన్యతను గుర్తించిన చంద్రబాబు ప్రతిసారీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు చొరవ చూపారని రాము తెలిపారు. ఎన్నికలంటే తమకు భయం లేదని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యేకు గుడివాడలో ఎన్నికలు జరిగితే ఎందుకు భయమని ప్రశ్నించారు. కొత్తతరం నాయకులు రాజకీయాల్లోకి వస్తారన్న భయంతోనే ప్రతిసారీ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయించడం వైసీపీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యేకు ఒకే విధానంగా మారిందని రాము విమర్శించారు. ఎవరికీ భయపడమని బయట బింకాలు పలుకుతున్నా అసలు విషయం వచ్చేసరికి పారిపోతున్నారని అన్నారు. ట్రంప్, మోడీ, చంద్రబాబు స్థాయిలను ప్రస్తావించడం కాకుండా నేలకు దిగి వాస్తవ పరిస్థితులపై మాట్లాడాలని సూచించారు.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాటలను బయట ప్రాంతాల వారు నమ్మవచ్చేమో కానీ గుడివాడ ప్రజలు నమ్మరని రాము అన్నారు. ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు వంద శాతం జరుగుతాయని, వాటిని ఎవరూ ఆపలేరని రాము స్పష్టం చేశారు. ఎంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించినా డిసెంబరులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి తీరుతామని అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.20 కోట్లకు పైగా నిధులు నిలిచిపోతున్నాయని, ఎన్నికలు జరిగితే ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.