సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం
సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం–హైదరాబాద్ 365బీ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న వోల్వో కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి మంటల్లో సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి.
ప్రమాదం ఉదయం 7.15 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంటల తీవ్రత కారణంగా కారు పూర్తిగా కాలిపోవడంతో పాటు నంబర్ ప్లేట్ కూడా దగ్ధమైంది. దీంతో వాహనం, మృతుడి వివరాలను గుర్తించడంలో పోలీసులకు తొలుత ఇబ్బందులు ఎదురయ్యాయి.
అయితే పోలీసుల దర్యాప్తులో మృతుడు ఖమ్మంలోని మమత హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ కాసకుర్తి జగదీష్‌గా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ ఎం. అనిల్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. వాహనం ఏ మార్గంలో ప్రయాణించింది, ప్రమాదానికి ముందు ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలను తెలుసుకునేందుకు మార్గమధ్యంలోని టోల్ ప్లాజాల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.