అనుమతులు లేకుండా పశువుల అక్రమ రవాణా.. 4 బొలెరో వాహనాలు స్వాధీనం
మిడ్జిల్: ఎలాంటి ముందస్తు అనుమతులు, రవాణా పత్రాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం తెల్లవారుజామున మిడ్జిల్ ప్రధాన రహదారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న నాలుగు బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా వాటిలో 22 పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. వంగూరు మండలం నుంచి కల్వకుర్తి, జడ్చర్ల మీదుగా షాద్‌నగర్, సర్దార్‌నగర్ ప్రాంతాలకు పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. పశువులకు సంబంధించి ఎలాంటి రశీదులు, రవాణా అనుమతి పత్రాలు లేకపోవడంతో పాటు, వాటిని వాహనాల్లో ఇరుకైన ప్రదేశంలో కట్టిపడేసి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో నాలుగు బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకుని, వాటిలోని 22 పశువులను రక్షించారు. అనంతరం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రక్షించిన పశువులను తగిన సంరక్షణ కోసం సమీపంలోని సురక్షిత గోశాలకు తరలించినట్లు స్థానిక ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను రవాణా చేయడం, అనుమతులు లేకుండా కబేళాలకు లేదా ఇతర ప్రాంతాలకు తరలించడం చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.