ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే ప్రారంభం
ఈనెల 24 వరకు కొనసాగనున్న సర్వే గంపలగూడెం: జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో శుక్రవారం నుంచి ఈనెల 24వ తేదీ వరకు ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విజయకృష్ణ తెలిపారు. సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, సకాలంలో ఉచిత చికిత్స అందించడం ద్వారా శాశ్వత అంగవైకల్యాన్ని నివారించడమే సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇంటింటి సర్వే విజయవంతం కావడానికి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు ఆరోగ్య సిబ్బందికి సహకరించి సర్వేను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా వైద్యాధికారి, అధికారులు కలిసి ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి సురేష్, కుష్టు వ్యాధి పునరావాస కార్యకర్త చంద్రశేఖర్, లెప్రా సొసైటీ ప్రతినిధి అబ్దుల్ వహీద్ భాషా, ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ సిబ్బంది పుల్లారావు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.