కాంగ్రెస్ వైఫల్యాలపై బిఆర్ఎస్ పోరుబాట
కాంగ్రెస్ వైఫల్యాలపై బిఆర్ఎస్ పోరుబాట పెంబట్లలో రోడ్డెక్కిన నేతలు.. వంటా వార్పుతో నిరసన
సారంగాపూర్,
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
మహిళలకు నెలకు రూ. 2,500 మహాలక్ష్మి సాయం, కళ్యాణలక్ష్మి నగదుతో పాటు తులం బంగారం, కేసీఆర్ కిట్లు, అర్హులైన విద్యార్థినులకు స్కూటీల పంపిణీ వంటి వాగ్దానాలను విస్మరించిన ప్రభుత్వ తీరుపై గులాబీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా తొలి జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌లతో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెంబట్ల గ్రామ శివారు నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపైనే వంటా వార్పు చేపట్టి, భోజనాలు చేసి వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.