కానిస్టేబుల్ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు
Ntoday News / తెలంగాణ :
రాష్ట్రంలో యూనిఫాం కొలువుల కోసం సిద్ధమవు తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ ఊరటని చ్చింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లోని కానిస్టేబుల్ తత్సమాన పోస్టులు ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో మూడేళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నది. గతంలో ఇచ్చిన ఏడేళ్ల సడలింపునకు ఇది అదనం కావడం విశేషం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో విడుదల చేశారు. వాస్తవానికి గత ఆగస్టు 14న విడుదల చేసిన జీవో నంబర్ 122 ద్వారా యూనిఫాం సర్వీసులైన పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్, ఎక్సెజ్, రవాణా, అటవీ శాఖల్లోని వివిధ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని ఏడేళ్ల పాటు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, హోంశాఖ నిబంధనల ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల గరిష్ట వయోపరిమితి 32ఏళ్లు ఉండగా, కానిస్టేబుల్ పోస్టులకు మాత్రం 29ఏళ్లుగా నిర్ధేశించారు. తద్వారా ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల వయోపరిమితి మధ్య మూడేళ్ల వ్యత్యాసం ఏర్పడింది. ఈ నిబంధనల అస మానతను గమనించిన నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించింది. ఎస్సై, కానిస్టేబుల్ కేటగిరీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసే ఉద్దేశంతో కానిస్టేబుల్ పోస్టులకు కూడా మరో మూడేళ్ల అదనపు వయోపరి మితి సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది.
దరఖాస్తు గడువు పొడిగింపు
పోలీస్ డిపార్ట్మెంట్ లోని పీసీ డ్రైవర్ పోస్టులు మినహా పోలీస్, ఫైర్, ప్రిజన్స్, ఎస్పీఎఫ్ విభాగాల్లోని కానిస్టేబుల్ స్థాయి పోస్టులన్నింటికీ ఈ అదనపు మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చేపట్టే ప్రస్తుత నియామ కాల్లో ఈ సవరణ అమల్లోకి రానుంది. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండటం, దరఖాస్తు గడువును కూడా సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వయోభారంతో అవకాశాన్ని కోల్పోతా మని ఆందోళన చెందిన వేలాది మంది నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం దక్కినట్టయింది.