సన్నవడ్లకు రూ.500 బోనస్.. రైతులకు నేడే చివరి అవకాశం
హైదరాబాద్: తెలంగాణలో వానాకాలం సీజన్‌లో సన్నరకం వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ పొందేందుకు పంట వివరాల నమోదు తప్పనిసరి. పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. గడువులోగా వివరాలు నమోదు చేసుకోని రైతులకు బోనస్ ప్రయోజనం లభించదని అధికారులు స్పష్టం చేశారు.
రైతులు టీ-అగ్రిసీడ్స్ వెబ్ పోర్టల్‌లో తమ ఆధార్, పట్టాదారు పాస్‌బుక్, విత్తనాల కొనుగోలు రశీదు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను సంబంధిత విత్తన విక్రయదారులే నమోదు చేసే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
అయితే సొంత విత్తనాలతో సన్నరకం వరి సాగు చేసిన రైతులు మాత్రం స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి. బోనస్ పొందేందుకు అర్హులైన రైతులు నేటిలోగా పంట వివరాల నమోదును పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.