కులాలకు అతీతంగా పేద విద్యార్థులకు చేయూత
ఏపీఎస్‌టీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ
ఒంగోలు: పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి అండగా నిలవడంతో పాటు కులాలకు అతీతంగా అర్హులైన విద్యార్థులకు సహాయం అందించడం అభినందనీయమని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. సమావేశంలో భాగంగా 50 మంది బీటెక్ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, 17 మంది పేద విద్యార్థులకు రూ.8 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
తమ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా సేవా సంఘం చేయూతనివ్వడం అభినందనీయమని మోహనకృష్ణ పేర్కొన్నారు. గత 18 నెలలుగా రూ.1 కోటికి పైగా నిధులను వెచ్చించి విద్యార్థుల ఫీజులు, వసతి గృహ ఖర్చులను భరిస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ కృషిని మోహనకృష్ణ ప్రత్యేకంగా కొనియాడారు.