Kuppam: కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జాతీయ ఏకతా దివాస్ వేడుకలు
సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఘన నివాళులు.. జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, అధ్యాపకులు
కుప్పం (ఎన్ టుడే న్యూస్):
కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 31న జాతీయ ఏకతా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ ఉక్కు మనిషి, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి బీసీఎన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి.సి. నాగరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.సి. నాగరాజ్ మాట్లాడుతూ దేశంలోని సంస్థానాలను ఏకీకృతం చేసి భారతదేశ ఐక్యతకు పటిష్టమైన పునాది వేసిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని కొనియాడారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత పటేల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ ఐక్యత, అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ
అనంతరం కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మాధవన్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గంగాధరన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ సతీష్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, పీఆర్వో ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.