యువతలో నిస్తేజం.. చదువు, ఉద్యోగం, నైపుణ్యాలకు దూరం
ఏపీ, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం
హైదరాబాద్, సెప్టెంబరు 20: దేశవ్యాప్తంగా యువతలో కొంత వర్గం విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి దూరంగా ఉంటున్న పరిస్థితిని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే–2025 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువతలో కొందరు చదువులో కొనసాగకపోవడంతో పాటు ఉద్యోగం లేదా ఉపాధిలోనూ లేకుండా, ఎలాంటి శిక్షణ పొందకుండా ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు. వీరిని ‘నీట్’ (NEET–Not in Employment, Education or Training) కేటగిరీగా పరిగణిస్తున్నారు. దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో 15–29 ఏళ్ల యువతలో 25 శాతానికిపైగా నీట్ కేటగిరీలో ఉన్నట్లు జిల్లా స్థాయి గణాంకాలు సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ దాదాపు సగం జిల్లాల్లో 25 శాతానికి పైగా యువత ఈ కేటగిరీలో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణకు యువత దూరంగా ఉండటం మానవ వనరుల వినియోగంపై ప్రభావం చూపే అంశంగా మారుతోంది.
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
దేశంలోని పలు ప్రాంతాల్లో యువత విద్యకు దూరమవడంతో పాటు ఉపాధి, శిక్షణ అవకాశాలను కూడా వినియోగించుకోలేకపోతున్నట్లు సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీట్ కేటగిరీలో ఉన్న యువత శాతం అధికంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. బిహార్, ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు వివరించింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో నీట్ శాతం 10 శాతం కంటే తక్కువగా నమోదైనట్లు సర్వే తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్, రాజ్‌నంద్‌గావ్, ఉత్తర బస్తర్ కాంకేర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా, కేరళలోని ఎర్నాకుళం, మధ్యప్రదేశ్‌లోని మండ్లా వంటి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
తగ్గిన విద్యావంతుల నిరుద్యోగ రేటు
2025 పీఎల్‌ఎఫ్‌ఎస్ గణాంకాల ప్రకారం, సెకండరీ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి విద్యను పూర్తి చేసిన 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగ రేటు 2024లో 7 శాతంగా ఉండగా, 2025లో 6.5 శాతానికి తగ్గినట్లు కేంద్ర గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే యువతలో విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణకు దూరంగా ఉన్న వర్గంపై ప్రత్యేక దృష్టి అవసరమనే అంశాన్ని తాజా జిల్లా స్థాయి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.