మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం
మధిర: మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో ఆదివారం భరత్ విద్యాసంస్థల డైరెక్టర్ శీలం వెంకట రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు బంకమట్టితో వినాయక విగ్రహాల తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. అనంతరం మట్టి వినాయకుడి విగ్రహాలనే పూజిస్తామని, పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రసాయనాలు, ఇతర కాలుష్యకారక పదార్థాలతో తయారయ్యే విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భరత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జై. కోటేశ్వరరావు, టి. ఉమ, కళా ఉపాధ్యాయురాలు వి. పూజిత, బెల్లంకొండ స్రవంతి, నీలిమ, ప్రియాంక తదితరులు పాల్గొని విద్యార్థులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.