ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదని ఎమ్మెల్యే అభ్యంతరం..
ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదని ఎమ్మెల్యే అభ్యంతరం.. ఎంపీడీవోకు షోకాజ్ నోటీసు
అన్నమయ్య జిల్లా, మదనపల్లె:
ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకపోవడంపై తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ములకలచెరువు మండల ఎంపీడీవోకు గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
ములకలచెరువు మండలం వేపూరికోట గ్రామంలో పంచాయతీరాజ్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) ఆధ్వర్యంలో గురువారం అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అయితే నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు కార్యక్రమం గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు ఆహ్వానం అందకపోవడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో అమలయ్యే ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి ఆహ్వానించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం నిర్వహించలేదని, దీనిపై ఎంపీడీవో నుంచి వివరణ కోరినట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించిన అంశంపై లిఖితపూర్వక వివరణ సమర్పించాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. నోటీసు అందిన 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
గడువులోగా సంతృప్తికరమైన వివరణ అందకపోతే విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు సమాచారం.