అర్నాబ్ తుఫాను నేపథ్యంలో ముంపు ప్రాంతాల పరిశీలన
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తిరువూరు ఆర్డీఓ ఏ. కుమార్ సూచన
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం, అక్టోబర్ 26: అర్నాబ్ తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ గంపలగూడెం మండలం తోటమూల గ్రామంలో భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడి, తుఫాను ప్రభావం, భారీ వర్షాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వివరించారు. పరిస్థితులు తీవ్రతరం అయితే ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అనంతరం గంపలగూడెం మండల రెవెన్యూ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ కార్యదర్శులతో ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావం, వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల వల్ల సంభవించే ప్రమాదాలపై సమీక్షించి, గ్రామస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో మైకుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి, తుఫాను ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, కనీసం రెండు రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, తాగునీరు, మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ముందుగానే గుర్తించి, అవసరమైన సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తుఫాను సమయంలో ప్రజల ప్రాణాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆర్డీఓ ఏ. కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.