పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సౌమ్యులు, మానవతావాదులుగా ఆర్యవైశ్యులు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని, పేదల విశ్వాసానికి వారు ప్రతినిధులుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, పలువురు శాసనసభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా పేద ఆర్యవైశ్య కుటుంబాల పిల్లలకు ఈ భవనం సంపూర్ణంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సంఘాల ప్రతినిధులకు సూచించారు.
సాధారణ ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన మహాత్మా గాంధీ భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదగడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలు కనిపిస్తాయని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా కొణిజేటి రోశయ్య అందించిన విశేష సేవలను ప్రస్తావించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సరుకులను అరువుగా ఇచ్చే విషయంలో ఆర్యవైశ్యులు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని సీఎం పేర్కొన్నారు. విశ్వాసానికి ఆర్యవైశ్యులు ప్రతీకగా నిలుస్తున్నారని అన్నారు. ముందు చూపుతో వ్యవహరించడం, జాగ్రత్తగా ఉండటం ఆర్యవైశ్యుల స్వభావంలోనే ఉందని పేర్కొన్నారు.
ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా, సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తేనే మరింత బలం చేకూరుతుందని ముఖ్యమంత్రి సూచించారు. ఐక్యతతో రాజకీయాల్లో తమకు దక్కాల్సిన ప్రాధాన్యతను సాధించుకోవచ్చని అన్నారు. ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించామని గుర్తుచేశారు.