పెనుగొలనులో ఘనంగా జాతీయ పోషకాహార మాసోత్సవం
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 100వ అంగన్వాడీ కేంద్రంలో గురువారం జాతీయ పోషకాహార మాసోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సీజన్‌లో లభించే ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
ఇంటి పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార పదార్థాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రక్తహీనత నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు. పోషకాహార లోపం వల్ల ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ అంగన్వాడీ కేంద్రాలకు చెందిన కార్యకర్తలు బి. నాగమణి, పి.వి. సాయి లక్ష్మి, కె. లింగమ్మ, కె. దివ్య, మహిళలు, గ్రామస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.