పెనుగొలనులో తాపీ ధర్మారావు, బోయి భీమన్న జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శనివారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు తాపీ ధర్మారావు, బోయి భీమన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొర్రపాటి యోహాను మాట్లాడుతూ తాపీ ధర్మారావు తెలుగు వార్తాపత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి ప్రసార మాధ్యమాల్లో గ్రాంథిక భాషకు బదులుగా సరళమైన వాడుక భాషను ప్రవేశపెట్టేందుకు విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం తాపీ ధర్మారావు జన్మదినాన్ని ‘తెలుగు మాధ్యమాల దినోత్సవం’గా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యపరిచేలా ‘దేవాలయాలపై బూతు బొమ్మలు లెందుకు?’, ‘ఇనుప కచ్చడాలు’, ‘హృదయోల్లాస వ్యాఖ్య’, ‘ఆలిండియా అడుక్కుతినే వాళ్ల మహాసభ’ వంటి రచనలు చేశారని వివరించారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ పద్మభూషణ్ పురస్కార గ్రహీత బోయి భీమన్న 1911 సెప్టెంబరు 19న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించారని తెలిపారు. పద్యాలు, గేయాలు, నాటకాలు, గ్రంథాలు, కావ్యాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనల్లో కొన్నింటిని తెలుగులోకి అనువదించారని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఐదో తరగతి విద్యార్థులు బోయి భీమన్న రచించిన ‘జయ జయ జయ అంబేడ్కర్’ గీతాన్ని ఆలపించారు. అనంతరం సాయిబాబా సేవా కమిటీ సభ్యులు గీతం ఆలపించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రెండో తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు, రంగు పెన్సిళ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఆర్పీ సంగెపు చిన్న నరసింహారావు, సాయిబాబా యువజన కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ, ఉపాధ్యాయులు జి. అలేఖ్య, ఎం. మాణిక్యం, డి. బేబీ, విద్యార్థులు పాల్గొన్నారు.