పగలు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో చోరీలు.....
పగలు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో చోరీలు.. అంతర్రాష్ట్ర దొంగకు చెక్ పెట్టిన తిరువూరు సర్కిల్ పోలీసులు
రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి అరెస్ట్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలో పగలు రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను తిరువూరు సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు, చోరీలకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ ఎల్. లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తిరువూరు సర్కిల్ పరిధిలోని మల్లెల, వెస్ట్ మాధవరం, సీమలపాడు, కలగర తదితర గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలు జరిగాయి. ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చోరీ జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు, వాహనాల కదలికలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఒకే వ్యక్తి పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను గుర్తించిన ప్రత్యేక పోలీసు బృందాలు విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామం ఊరు బయట తిరువూరు రోడ్డు వద్ద చింతల గోపాలరావు అలియాస్ గోపీని అదుపులోకి తీసుకున్నాయి.
విచారణలో నిందితుడు పలు చోరీలకు సంబంధించిన వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కలగర గ్రామంలో చోరీకి సంబంధించి 130 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, రూ.2 వేల నగదు, చోరీలకు ఉపయోగించిన ఏపీ 40 కేఎస్ 2882 నంబర్ గల యాక్సిస్ స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి వివరాలు
చింతల గోపాలరావు అలియాస్ గోపీ (32) వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో నివాసం ఉంటున్నాడు.
ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని డీసీపీ సూచించారు. ఎక్కువ రోజుల పాటు ప్రయాణం చేయాల్సి వస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఈ మీడియా సమావేశంలో తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. గిరిబాబు, విస్సన్నపేట ఎస్‌ఐ ఎం. అర్జున్ రాజ్, తిరువూరు ఎస్‌ఐ ఎం. శాతకర్ణి, ఏ.కొండూరు ఎస్‌ఐ జి. మహాలక్ష్మణుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.