వర్షపు నీటిలో పామర్రు రెవెన్యూ కార్యాలయం
వర్షపు నీటిలో పామర్రు రెవెన్యూ కార్యాలయం.. పడవలోనే కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పామర్రు మండల రెవెన్యూ కార్యాలయం భారీ వర్షాలకు పూర్తిగా నీట మునిగింది. కార్యాలయ ప్రాంగణం చెరువును తలపించేలా మారడంతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయానికి చేరుకోవాలంటే పడవలో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
భారీగా చేరిన వర్షపు నీరు కార్యాలయంలోకి కూడా ప్రవేశించడంతో ఫర్నిచర్, కుర్చీలు, టేబుళ్లు నీటిలో తేలియాడుతున్నాయి. వర్షపు నీటిలోనే రెవెన్యూ ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తుండటంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. కార్యాలయానికి వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎంతమంది పాలకులు మారినా పామర్రు మండల రెవెన్యూ కార్యాలయ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఉద్యోగులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి కార్యాలయ ప్రాంగణం నీటమునగడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రెవెన్యూ కార్యాలయంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని పామర్రు మండల రెవెన్యూ సిబ్బంది కోరుతున్నారు.