మంగళగిరిలో కొండచిలువ కలకలం
మంగళగిరిలో కొండచిలువ కలకలం సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు
మంగళగిరి ఇందిరానగర్ ప్రాంతంలో కొండచిలువ కనిపించడంతో స్థానికుల్లో కలకలం రేగింది. వర్షాకాలం నేపథ్యంలో జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మేకల సతీష్ బాబు, ఎకో పార్క్ సిబ్బంది, హనుమాన్ టీం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం అరణ్యరామం (బ్రహ్మానందపురం) అటవీ ప్రాంతానికి తరలించి సురక్షితంగా వదిలిపెట్టారు.
వర్షాకాలంలో పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నివాస ప్రాంతాల్లో పాములు కనిపిస్తే వాటిని స్వయంగా పట్టుకునేందుకు ప్రయత్నించకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మంగళగిరి, పరిసర ప్రాంతాల్లో పాములు లేదా కొండచిలువలు కనిపించినప్పుడు 9966809162, 8341818594 నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.