రమణక్కపేట సాగుదారులతో జాయింట్ కలెక్టర్ ముఖాముఖి సమీక్ష నిర్వహించి పట్టాలు మంజూరు చేయాలి
రమణక్కపేట సాగుదారులతో జాయింట్ కలెక్టర్ ముఖాముఖి సమీక్ష నిర్వహించి పట్టాలు మంజూరు చేయాలి: సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ డిమాండ్
నూజివీడు, జూలై 20: ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో మూడు తరాలుగా భూములు సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద రైతులకు భూమి హక్కు పత్రాలు, పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల బక్కయ్య డిమాండ్ చేశారు.
రమణక్కపేటలో సుమారు 225 మంది రైతులు దాదాపు 420 ఎకరాల భూమిని ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తూ మామిడి తోటలను పెంచుతున్నప్పటికీ, ఆ భూములు అటవీ భూమిగా నమోదై ఉండటంతో వారికి పట్టాలు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ, అన్నదాత సుఖీభవ, ఎరువులు, పురుగుమందుల సబ్సిడీలు సహా ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా అందకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
2017 సంవత్సరం నుంచి సిపిఐ(ఎంఎల్) లిబరేషన్, అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో రైతుల తరఫున అనేక ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడంతో పాటు విజయవాడ సెటిల్‌మెంట్ కోర్టు, సంబంధిత శాఖల అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినట్లు చెప్పారు. అనంతరం అటవీ, రెవెన్యూ శాఖలు గ్రామంలో సంయుక్త సర్వే నిర్వహించి, సర్వే నంబర్లు 1, 2, 3, 4/33 పరిధిలోని 420 ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తున్నారని, అయితే ఆ భూమి అటవీ క్లాసిఫికేషన్‌లో నమోదై ఉందని ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్లు వివరించారు.
ఈ సమస్యను ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా హక్కుల పరిష్కార వేదికలో ప్రస్తావించి, గ్రామంలో జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు రైతులతో కలిసి ముఖాముఖి సమీక్ష నిర్వహించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ వినతిపత్రాన్ని రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు బదిలీ చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా నూజివీడు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో అధికారులను కలిసి సమస్య వివరించగా, తమ పరిధిలో ఉన్న మేరకు నివేదిక పంపిస్తామని అధికారులు తెలిపినట్లు బక్కయ్య చెప్పారు. అయితే గ్రామంలో ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించాలని కోరితే మళ్లీ అదే వినతిపత్రాన్ని సంబంధిత శాఖకు బదిలీ చేయడం పేద రైతులకు న్యాయం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు రమణక్కపేట గ్రామంలో రైతులతో ముఖాముఖి సమీక్ష నిర్వహించాలని, సాగులో ఉన్న భూములను డీ-నోటిఫై చేసి అటవీ క్లాసిఫికేషన్‌ను మార్చి అర్హులైన సాగుదారులకు భూమి పట్టాలు మంజూరు చేయాలని వేముల బక్కయ్య డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, పల్లె పాము భవాని, కొత్తపల్లి రాంప్రసాద్, మాదాసు పుల్లారావు, తోట కొండలరావు, ఉప్పే రాంబాబు, ఉప్పె శ్రీనివాసరావు, సూరత్ శ్రీనివాసరావు, గడ్డం నాగేశ్వరరావు, మత్తే కాంతారావు, మత్తె భాస్కరరావు, జుంజునూరి కృష్ణమోహన్, జుంజునూరి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.