శబరిమలలో బంగారు కిరీటం మాయమైనట్లు నివేదికలు..
సురక్షితంగానే ఉందంటున్న దేవస్వం బోర్డు
ఎన్ టుడే న్యూస్ | కేరళ: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు ఆభరణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆలయ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచినట్లు రికార్డుల్లో ఉన్న 55.72 పవర్ల బంగారు కిరీటం కనిపించడం లేదని, దాని స్థానంలో సుమారు 240 గ్రాముల బరువున్న నకిలీ కిరీటం ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
2012లో తమిళనాడుకు చెందిన భక్తులు సమర్పించిన ఈ కిరీటం అసలు బరువు 445.78 గ్రాములుగా రికార్డుల్లో నమోదైంది. అయితే స్ట్రాంగ్ రూమ్‌లో ప్రస్తుతం ఉన్న కిరీటం సుమారు 240 గ్రాముల బరువుతో ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కిరీటం ఒకే పరిమాణం, ఆకృతిలో ఉండటంతో పాటు తెల్లటి రాళ్లు పొదిగినట్లు సమాచారం.
కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఆలయ తిరువాభరణాల తనిఖీలు జరుగుతున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ తనిఖీలకు హైకోర్టు నియమించిన అమికస్ క్యూరీ జస్టిస్ కేటీ శంకరన్ నేతృత్వం వహిస్తున్నారు.
కిరీటం సురక్షితంగానే ఉందంటున్న బోర్డు
అయితే బంగారు కిరీటం చోరీకి గురైందని ఇప్పుడే నిర్ధారించలేమని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు. కిరీటం శబరిమల స్ట్రాంగ్ రూమ్‌లో లేకపోతే ఆరన్ముల స్ట్రాంగ్ రూమ్‌లో ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తిరువాభరణం కమిషనర్ నుంచి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత స్పష్టత వస్తుందని చెప్పారు.
కిరీటం నిజంగా ఎక్కడ ఉంది? స్ట్రాంగ్ రూమ్‌లో నకిలీ కిరీటం ఎలా వచ్చింది? అనే అంశాలపై ప్రస్తుతం పరిశీలన కొనసాగుతోంది. పూర్తి వివరాలు అధికారిక తనిఖీ నివేదిక వెలువడిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.