సూర్యాపేటలో బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన.. జాతీయ రహదారిపై రాస్తారోకో
అసెంబ్లీకి వెళ్లకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సూర్యాపేటలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అంజనాపురి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై వందలాది మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నల్ల దుస్తులు ధరించి నిరసన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ మండిపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరును విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నల్ల దుస్తులతో నిరసన కొనసాగుతున్న సమయంలో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్వల్పంగా గాయపడినట్లు బీఆర్‌ఎస్ శ్రేణులు తెలిపారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు.