స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు.. మండలిలో చర్యలకు రంగం సిద్ధం
తెలంగాణ: స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు.. మండలిలో చర్యలకు రంగం సిద్ధం
ఎమ్మెల్సీపై మండలి చైర్మన్ సీరియస్.. సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు చెబుతున్న అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్పీకర్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేయడంతో వివాదం మరింత ముదిరింది.
ఈ వ్యవహారంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే శాసన మండలి నుంచి ఆయనను సస్పెండ్ చేయడం లేదా బహిష్కరించే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని అధికారపక్ష నేతలు పేర్కొన్నారు. తాతా మధు వ్యాఖ్యలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు.
చర్యలు తీసుకోవాల్సిందే: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాతా మధు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ సభకు అధిపతి అని, ఆయనను ఎవరైనా దూషిస్తే అది తప్పేనని అన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని స్పష్టం చేశారు.
గతంలో తాను, సంపత్‌కుమార్ ఎలాంటి తప్పు చేయకపోయినా సస్పెన్షన్‌కు గురయ్యామని మంత్రి గుర్తుచేశారు. శాసనసభ గౌరవాన్ని కాపాడేందుకు స్పీకర్‌పై అనుచితంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: సీతక్క
మంత్రి సీతక్క కూడా తాతా మధుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆమె పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే తాతా మధును పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
మండలి చైర్మన్‌కు లేఖ రాస్తా: మల్లు రవి
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుపై చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దళితులను అవమానించడమేనని ఆయన అన్నారు.
ఈ వ్యవహారంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ రాస్తానని తెలిపారు. తాతా మధుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు స్పందించాలని కోరారు.
మరోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలి
తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా స్పందించారు. బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమంలో ఆయన అభ్యంతరకరంగా మాట్లాడారని ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఉండి శాసన వ్యవస్థలోని అత్యున్నత పదవుల్లో ఒకటైన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
తాతా మధును సస్పెండ్ చేయడంతో పాటు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
దళితులను అవమానించారు: అద్దంకి దయాకర్
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాతా మధు వ్యాఖ్యలు దళితులను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు.
దళితులంటే బీఆర్‌ఎస్‌కు చిన్నచూపు ఉందని విమర్శించారు. తాతా మధు మాట్లాడిన మాటలను కేసీఆర్, కేటీఆర్‌పై ఉపయోగిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బహిరంగ క్షమాపణ చెప్పాలి: బల్మూరి వెంకట్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తాతా మధుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను దూషించినందుకు తాతా మధు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం నిర్వహించిన మరుసటి రోజే ఇలాంటి వ్యాఖ్యలు వెలువడటం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అని ప్రశ్నించారు. తాతా మధు క్షమాపణ చెప్పకపోతే ఈ వ్యవహారానికి కేసీఆర్, కేటీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అలాగే తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, వెంటనే శాసన మండలి నుంచి సస్పెండ్ చేయాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తాతా మధు వ్యాఖ్యలపై శాసన మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.