స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి నాలుగు కార్మిక చట్టాలు కార్మికుల హక్కులను హరిస్తున్నాయి
ఎఐసిసిటియు, సిపిఐ యమ్‌ఎల్ నాయకుల డిమాండ్
విజయవాడ: పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, వంట కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్కీం వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ధర్నా చౌక్‌లో రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించారు. అరుణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎఐసిసిటియు రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కిరణ్, సిపిఐ యమ్‌ఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్, ఎం.పి. రాందేవ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు కార్మికుల హక్కులను నిర్వీర్యం చేసి యజమానులకు అనుకూలంగా మారేలా ఉన్నాయని విమర్శించారు. ఈ చట్టాల అమలుతో కార్మిక వర్గం మరింత అణచివేతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ నిర్వచనంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు కూడా ఇదే ధోరణిలో ఉందని పేర్కొన్నారు.
ఒకవైపు పెద్ద కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వేల కోట్ల రూపాయల రుణాల విషయంలో రాయితీలు, పరిష్కార మార్గాలు కల్పిస్తున్న ప్రభుత్వాలు.. మరోవైపు స్కీం కార్మికులు, పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, వంట కార్మికులకు నెలల తరబడి చెల్లింపులు నిలిపివేయడం ప్రభుత్వాల ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోందని నాయకులు విమర్శించారు.
స్కీం కార్మికులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లేకుండా పనిచేయిస్తున్నారని అన్నారు. వారి సేవలను గుర్తించి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంగా నెలకు రూ.42 వేల చెల్లించాలని, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులు, ఇతర చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎఐసిసిటియు రాష్ట్ర నాయకులు ఎన్. సురేంద్రనాథ్, బందెల ఓబయ్య, సిగి చెన్నయ్య, సుబ్బయ్య, ఈశ్వర్, బక్కయ్య, పుల్లారావు, పూజిత, కుమారి, ఆదాం తదితరులతో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో స్కీం కార్మికులు, ఎఐసిసిటియు కార్యకర్తలు పాల్గొన్నారు.