ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు ఎస్ఐఆర్ నోటీసులు.. ఈసీ వివరణపై ప్రశ్నలు
ఢిల్లీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కూడా ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. తన ఓటరు అర్హతకు సంబంధించిన వివరాలు, పూర్వీకుల పత్రాలను సమర్పించిన అనంతరం అధికారులు వాటిని పరిశీలించి, నవంబర్ 4న ప్రకటించనున్న తుది ఓటర్ల జాబితాలో ఆమె పేరును కొనసాగించేందుకు ఆమోదం తెలిపినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రేఖా గుప్తాకు నోటీసు జారీ చేసిన విషయాన్ని ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ గుర్తించి వెలుగులోకి తెచ్చారు. ఢిల్లీలో సుమారు 97.5 లక్షల మంది ఓటర్లు ఉండగా, దాదాపు 33 లక్షల మందికి ఎస్ఐఆర్ కింద నోటీసులు జారీ అయినట్లు సమాచారం. ఈ జాబితాలో ముఖ్యమంత్రి పేరు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రేఖా గుప్తా తన ఎన్నికల అఫిడవిట్‌లో ఏపీ బ్లాక్ ప్రాంతాన్ని నివాస చిరునామాగా పేర్కొన్నారు. అదే ప్రాంతానికి సంబంధించిన ఓటర్ల పరిశీలనలో ఆమె పేరుతో నోటీసు జారీ అయినట్లు వెల్లడైంది. ఎన్యూమరేషన్ ఫారమ్‌లో నమోదైన వివరాల్లో తార్కికంగా పొంతన లేని అంశాన్ని గుర్తించినందుకే నోటీసు ఇచ్చినట్లు షాలిమార్ బాగ్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి తెలిపారు. బూత్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం రేఖా గుప్తా సమర్పించిన వివరాలను ధ్రువీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అర్హులైన పౌరుల పేర్లు తొలగిపోకుండా, అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా చూడటమే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉద్దేశమని ఎన్నికల అధికారులు వివరించారు. ఇదే సమయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్‌కు కూడా ఎస్ఐఆర్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల వివరాలు 2002 నాటి ఓటర్ల జాబితాతో సరిపోలకపోవడాన్ని నోటీసులకు కారణంగా చూపినట్లు వెల్లడైంది. అయితే కేజ్రీవాల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి వారి పత్రాలను ఇంకా ధ్రువీకరించలేదని, తుది ఓటర్ల జాబితాలో పేర్లను కొనసాగించేందుకు ఆమోదం ఇవ్వలేదని పేర్కొన్నట్లు కథనం తెలిపింది. ఈ పరిణామాలపై మహమ్మద్ జుబైర్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. రేఖా గుప్తాకు ఎప్పుడు నోటీసు ఇచ్చారు, ఆమె పత్రాలను ఎప్పుడు పరిశీలించారు, తుది జాబితాలో పేరు కొనసాగించేందుకు ఎప్పుడు ఆమోదం తెలిపారు అనే వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించాలని కోరారు. లక్షలాది మంది సాధారణ ఓటర్ల విషయంలోనూ ఇదే విధమైన వేగవంతమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను అమలు చేస్తున్నారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. న్యాయవాది అంజలి భరద్వాజ్ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలోని విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తుల ఓటరు అర్హతలపై కూడా ఇప్పుడు పరిశీలన జరగడం ప్రక్రియలోని విధానపరమైన అంశాలపై సందేహాలు కలిగిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఎస్ఐఆర్ మూడో దశలో చేపట్టిన సవరణల్లో పెద్ద సంఖ్యలో ఓటర్ల వివరాలు పరిశీలనకు రావడం ఈ వ్యవహారాన్ని మరింత చర్చకు తెచ్చింది. అయితే నోటీసులు జారీ కావడం ఒక్కటే ఓటరు అర్హత రద్దయినట్లు అర్థం కాదని, సంబంధిత పత్రాల పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.