పెనుగొలనులో ఘనంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం వర్ధంతి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గాన గాంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరో వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ శ్రీపతి పండిత రాధ్యుల బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4న నెల్లూరులో జన్మించారని తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అత్యధిక పాటలను రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నమోదైందని గుర్తుచేశారు. ఈటీవీలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన గాయనీ గాయకులను పరిచయం చేసి, వారి ప్రతిభను ప్రోత్సహించారని తెలిపారు. సంగీత రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి జాతీయ పురస్కారాలతో పాటు నంది, ఫిలింఫేర్ తదితర అనేక అవార్డులు అందుకున్నారని వివరించారు. సినీ నేపథ్య గాయకుడిగా మాత్రమే కాకుండా శాస్త్రీయ, లలిత, భక్తి సంగీత రంగాల్లోనూ తనదైన శైలిని చాటుకున్నారని కొనియాడారు. 2020 సెప్టెంబర్ 25న చెన్నైలో అనారోగ్యంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందారని గుర్తుచేసుకున్నారు. ఆయన పాటలు, సంగీత సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వక్తలు పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, పొనుగుపాటి సత్యం, వూటుకూరు యజ్ఞకృష్ణ, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.