తిరువూరులో గణనాథునికి ప్రత్యేక పూజలు
తిరువూరులో గణనాథునికి ప్రత్యేక పూజలు 6 వేల మంది భక్తులకు మహా అన్నదానం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణంలోని బోస్ బొమ్మ సెంటర్‌లో సంకా నాగేశ్వరరావు కిరాణా షాపు వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి శుక్రవారం ఐదో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆర్డీఓ ఏ. కుమార్, స్థానిక వ్యాపార ప్రముఖులు కుందా వెంకటేశ్వరరావు, సంకా శివప్రసాద్, ఎల్‌ఐసీ కాంతారావు తదితరులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 6 వేల మంది భక్తులకు మహా అన్నదాన ప్రసాద సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, కానుకలు సమర్పించారు. దీంతో బోస్ బొమ్మ సెంటర్ పరిసర ప్రాంతం భక్తులతో సందడిగా మారింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.