దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం
ఆలయాల భద్రతపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్ అక్టోబర్ 03/ఎన్ టుడే న్యూస్..
దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రసిద్ధ సంతోషీమాత ఆలయంలో అమ్మవారి విగ్రహంపై దాడి జరిగిన ఘటనపై ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలుసుకున్న వారు ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, అసలు కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో గతంలోనూ ముత్యాలమ్మ, చిట్టిముత్యాలమ్మ, సంతోషీమాత ఆలయాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్న విషయాన్ని వారు ప్రస్తావించారు. వరుసగా ఆలయాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, వీటిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.
ఆలయాల వద్ద, ముఖ్యంగా అమ్మవారి ఆలయాల వద్ద భద్రతను మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయాల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
సంతోషీమాత ఆలయ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేలా సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ముద్ద కళ్యాణ్, చంద్రశేఖర్ అజాద్ తదితరులు పాల్గొన్నారు.