ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా బట్టబయలు
ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా బట్టబయలు
-195 ట్రాన్స్‌ఫార్మర్లలో దొంగతనం – 55 కేసులు ఛేదన -6 మంది అరెస్ట్… రాగి వైర్లు, వాహనాలు స్వాధీనం
తిరుపతి, మార్చి 18:
వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని రాగి వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి భారీ గ్యాంగ్‌ను బట్టబయలు చేశారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కలిపి 195 ట్రాన్స్‌ఫార్మర్లలో దొంగతనాలు చేసిన ఈ ముఠా సభ్యులను పట్టుకుని మొత్తం 55 కేసులను పోలీసులు ఛేదించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముఠా వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన 400 కిలోల రాగి వైర్లు, రెండు ఆటోలు, రెండు మోటార్ సైకిళ్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది కాలంగా ఎక్కడా పట్టుబడకుండా చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ తిరుగుతున్న ఈ ముఠాను ప్రత్యేక బృందాలు పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నాయి.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో, నాయుడుపేట డీఎస్పీ చెంచు బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలయ్యపల్లి మండలం జయంపు క్రాస్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా ఐదుగురు దొంగలు పట్టుబడ్డారు. వారి వద్ద దొంగతనాలకు ఉపయోగించిన పరికరాలు, రాగి వైర్లు లభించాయి.
విచారణలో ఈ ముఠా తిరుపతి జిల్లాలో 45 కేసులు, నెల్లూరు జిల్లాలో 10 కేసులు చేసినట్లు వెల్లడైంది. దొంగ సొత్తు కొనుగోలు చేసిన మనుబోలు మండలానికి చెందిన చల్లా రాఘవను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కేవలం రూ.15–20 వేల విలువైన రాగి వైర్ కోసం సుమారు రూ.2.5 లక్షల విలువైన ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పోలీసులు తెలిపారు. పంట నష్టం, విద్యుత్ అంతరాయం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల అమరికలో ఆలస్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అరెస్ట్ అయిన ముద్దాయిలపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో దొంగ సొత్తు కొనుగోలు చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి, సిబ్బందికి రివార్డులు అందజేశారు.