తిరుపతి మేయర్ పీఠంపై వైసీపీ కొత్త వ్యూహం.. అభ్యర్థి ఎంపికలో సామాజిక సమీకరణాలతో పాటు ఇమేజ్‌కు ప్రాధాన్యం
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగా కేవలం కుల సమీకరణాలపైనే ఆధారపడకుండా.. సామాజిక వర్గాల బలం, అభ్యర్థి వ్యక్తిగత ప్రతిష్ట, ప్రజల్లో గుర్తింపు, సేవా కార్యక్రమాలు, యువతలో ఆదరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2021లో జరిగిన పరోక్ష ఎన్నికల్లో వైసీపీ 48 మంది కార్పొరేటర్లను గెలుచుకుంది. ఒక స్థానంలో ఎన్నిక నిలిచిపోగా, గట్టి పోటీలో టీడీపీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ విజయం సాధించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో జనరల్ మహిళకు రిజర్వ్ అయిన మేయర్ స్థానాన్ని యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ఆర్. శిరీష యాదవ్‌కు వైసీపీ అవకాశం కల్పించింది.
అప్పట్లో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్‌రెడ్డి కారణంగా గత సంప్రదాయాల ప్రకారం బలిజ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే స్థానిక నేతల అభిప్రాయాలు ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం వేరే నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.
మారుతున్న తిరుపతి రాజకీయ లెక్కలు
తిరుపతి మున్సిపల్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. 1981లో పి.ఎస్. గురవారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక కాగా, అనంతరం మబ్బు రామిరెడ్డి అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ అయ్యారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోలా రాము చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1985లో మబ్బు రామిరెడ్డి కాంగ్రెస్ తరఫున తిరిగి గెలిచారు. 1987లో వి. మునిరత్నం చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
1999లో తిరుపతి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి గెలిచిన తర్వాత 2002 మున్సిపల్ ఎన్నికల్లో కే. శంకర్‌రెడ్డికి టీడీపీ అవకాశం ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డిపై విజయం సాధించారు.
2007లో తిరుపతి మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారినప్పటికీ 2021 వరకు ఎన్నికలు జరగలేదు. 2021లో పరోక్ష ఎన్నికల ద్వారా వైసీపీ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు గత అనుభవాలను పరిశీలిస్తున్నాయి.
కూటమికి స్వల్ప ఆధిక్యం ఉందా?
తిరుపతి రాజకీయాల్లో కూటమికి సంప్రదాయంగా కొంత అనుకూలత ఉందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే అది పూర్తిస్థాయి స్థిరమైన ఓటు బ్యాంకు కాదని పరిశీలకులు చెబుతున్నారు.
బలిజ సామాజిక వర్గం తిరుపతిలో ప్రభావవంతమైన వర్గంగా ఉన్నప్పటికీ, అన్ని ఉపవర్గాల రాజకీయ అభిప్రాయాలు ఒకేలా ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బీసీ వర్గాల్లో యాదవ, కురుబ, పద్మశాలి, వడ్డెర తదితర వర్గాల ఓటింగ్ కూడా అభ్యర్థి, స్థానిక పరిస్థితుల ఆధారంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కొన్ని రాజకీయ అంచనాల ప్రకారం కూటమికి అనుకూలంగా బలిజ వర్గాలు, బీసీలు, ఇతర అగ్రవర్ణ వర్గాలు కలిపి సుమారు 52 శాతం వరకు మద్దతు ఉండవచ్చని చెబుతున్నారు. వైసీపీకి రెడ్డి, ఎస్సీ, ముస్లిం, ఎస్టీ వర్గాల మద్దతు కలిపి సుమారు 47 శాతం వరకు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇవి అధికారిక గణాంకాలు కాకుండా రాజకీయ విశ్లేషణలు మాత్రమే.
కులం కంటే అభ్యర్థి ఇమేజ్ కీలకం
ఈసారి తిరుపతి మేయర్ ఎన్నికల్లో యువత, ముఖ్యంగా కొత్త తరం ఓటర్ల పాత్ర కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సోషల్ మీడియా ప్రభావంతో అభ్యర్థి వ్యక్తిత్వం, గత పనితీరు, ప్రజలతో సంబంధాలు, సమస్యలపై స్పందన, పరిపాలనా సామర్థ్యం వంటి అంశాలు వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి.
కుల ప్రభావం కొనసాగుతున్నప్పటికీ.. అభ్యర్థి వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంచనా వేస్తున్నారు.
రెడ్డి వర్సెస్ బలిజ–బీసీ సమీకరణం?
కూటమి ఎమ్మెల్యే బలిజ సామాజిక వర్గానికి చెందిన నేపథ్యంలో.. వైసీపీ నుంచి రెడ్డి అభ్యర్థిని బరిలోకి దింపాలా? లేక బీసీ లేదా బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలా? అనే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే భూమన అభినయ్‌రెడ్డి భవిష్యత్‌లో ఎమ్మెల్యే పోటీపై దృష్టి పెట్టిన నేపథ్యంలో, ఆయనకు బదులుగా బీసీ లేదా బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతను మేయర్ అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచన కూడా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కూటమి తరఫున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి వస్తే వైసీపీ బలిజ లేదా బీసీ అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉందని.. కూటమి బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే వైసీపీ రెడ్డి అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే చివరికి సామాజిక సమీకరణాల కంటే ప్రజల్లో మంచి పేరు, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థికే ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం.