తిరువూరులో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తిరువూరులో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు:
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (APUWJ) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తిరువూరులో జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, పత్రికా స్వేచ్ఛ కోసం ఏపీయూడబ్ల్యూజే దశాబ్దాలుగా చేస్తున్న సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు.
1957 ఆగస్టు 17న ప్రారంభమైన ఏపీయూడబ్ల్యూజే ఏడు దశాబ్దాలుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, వృత్తి ప్రమాణాల పెంపు, భద్రత, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరువూరు జర్నలిస్టులు రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ ఏ. కుమార్‌కు జర్నలిస్టుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు.
అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని అనాథాశ్రమాలను సందర్శించిన జర్నలిస్టులు అక్కడి వారికి అన్నదానం నిర్వహించి, కేక్ కట్ చేసి ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఖాజా మొహిద్దిన్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే కేవలం జర్నలిస్టుల హక్కుల కోసం మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటోందని తెలిపారు. జర్నలిజం వృత్తికి సామాజిక స్పృహను జోడించి యూనియన్ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.
కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండి అసదుల్లా (ఆంధ్రప్రభ), సీనియర్ జర్నలిస్టులు కె. రామ్మోహన్‌రావు (సాక్షి), మహేష్ (ఆంధ్రజ్యోతి), ఎం. సురేష్ (ఈనాడు), అబ్దుల్ రహమాన్ (ఆంధ్రప్రభ) పాల్గొన్నారు.
తిరువూరు నియోజకవర్గ అధ్యక్షుడు బద్రి (ఎన్టీవీ), గౌరవ అధ్యక్షుడు షేక్ సైదులు (సాక్షి టీవీ), ఉపాధ్యక్షుడు అమిదిపురం మురళి (టీవీ9), ట్రెజరర్ బలుసుపాటి వెంకటేశ్వరరావు (హెచ్‌ఎంటీవీ), బొర్రా శ్రీనివాసరావు (రాజ్ టీవీ) తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, నియోజకవర్గ స్థాయి వరకు బలమైన నాయకత్వంతో ముందుకు సాగుతున్న ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టు సమాజానికి అండగా నిలుస్తోందని యూనియన్ నాయకులు తెలిపారు. ఏడు దశాబ్దాల ఈ ప్రస్థానం జర్నలిస్టులకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.